భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ డీవై చంద్రచూడ్​ ప్రమాణం

-

సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది. 44 ఏళ్ల క్రితం తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పని చేస్తే, ఇప్పుడు తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి. కొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో సరిగ్గా రెండేళ్లు కొనసాగుతారు.

44 ఏళ్ల క్రితం జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల అయిదు నెలలపాటు ఆ పదవిలో కొనసాగి సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ స్థానానికి చేరుకుంటున్న జస్టిస్‌ చంద్రచూడ్‌ 2024 నవంబర్‌ 10వరకు సీజేఐగా కొనసాగుతారు.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ ముందు పలు సవాళ్లు ఉన్నాయి. న్యాయమూర్తుల ఖాళీల భర్తీ, న్యాయవ్యవస్థలో మౌలికసదుపాయాల కల్పన, పెండింగ్‌ కేసులను పరిష్కరించడం, వేగంగా న్యాయం అందించడం అందులో ప్రధానమైనవి. ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీం కేసుల్లో ఎలా వ్యవహరిస్తారోనన్న ఉత్కంఠ న్యాయనిపుణుల్లో వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version