చివరి వ్యక్తి వరకు న్యాయం చేయడమే మన పార్టీ సిద్దాంతం అని తెలంగాణ ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ తెలిపారు. గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. పారదర్శకత, జవాబుదారి తనం చాలా ముఖ్యం అన్నారు. రాహుల్ మాట ప్రకారం తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. అలాగే మరోసారి అధికారంలోకి రావాలి.
తెలంగాణలో మనం అధికారంలోకి రావాలంటే మన ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని తెలిపారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం.. తెలంగాణలో కులగణన సక్సెస్ కావడం చాలా సంతోషం అన్నారు. పార్టీ కార్యక్రమాలపై ఓ క్యాలెండర్ తయారు చేస్తాం. ప్రభుత్వంలో కార్యకర్తల భాగస్వామ్యం ఉండాల్సిందే అన్నారు. పదేళ్లు కష్టపడ్డ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను కూడా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు మీనాక్షి నటరాజన్.