బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ 21వ తేదీన జరిగింది. ఈ నేపథ్యంలోనే.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు.
టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మునుగోడులో ప్రజాశాంతి పార్టీదే విజయం అని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తాము మునుగోడులో పోటీ చేస్తున్నామన్నారు.
శనివారం హైదరాబాద్ అమీర్ పేట లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పాల్, 56 సంవత్సరాలుగా మునుగోడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూనే ఉందన్నారు. ఈ 8 ఏళ్లలో సీఎం కేసీఆర్ కూడా అక్కడి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. హామీలు విస్మరించడం, ఎన్నికల్లో డబ్బులు వేదజల్లి గెలవడం తప్ప కెసిఆర్ కి ఇంకేమీ చేతకాదని ఎద్దేవా చేశారు. ప్రజలు తాయిలాలకు, ప్రలోభాలకు లొంగిపోకుండా అభివృద్ధి చేయని ఈ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.