తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థులను ప్రకటించడంతో టికెట్ ఆశించి భంగపడ్డ వారు కొందరూ.. కొందరూ సిట్టింగ్ లు కూడా టికెట్ రాక నిరాశ చెందిన వారున్నారు. వీరిలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకి ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ లభించలేదు. దీంతో తాజాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా వ్యాఖ్యాలు చేశారు.
స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ టికెట్ ను కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటియించడంపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ఒక గుంటనక్క అని.. గతంలో రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవీ పోవడానికి కూడా కడియం శ్రీహరినే కారణమని అన్నారు. ఇప్పుడు ఆయనకు టికెట్ రాకపోవడానికి కూడా ఆయనే కారణమని అన్నారు. మాదిగ టికెట్ ను మాదిగ సామాజిక వర్గం వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మాదిగ అయిన రాజయ్యకు టికెట్ ఇవ్వకపోతే, ఆ టికెట్ ను మరో మాదిగకే ఇవ్వాలని అన్నారు. కడియం శ్రీహరికి బీఫామ్ ఎలా వస్తుందో తాను చూస్తానని కృష్ణ మాదిగ సవాల్ విసిరారు.