తెలంగాణ రాజకీయాలు కొద్ది రోజులుగా హీటెక్కుతున్నాయి. ప్రతి రోజు ఎవరో ఒక కీలక నాయకుడు బీజేపీలోకో లేదా టీఆర్ఎస్‌లోకో వెళుతూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు నెలలకే తెలంగాణ రాజకీయం పూర్తిగా మారిపోయింది. టీఆర్ఎస్‌కు వార్ వన్‌సైడే అనుకుంటే బీజేపీ అనూహ్యంగా అక్కడ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అసంతృప్తులంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. సందట్లో సడేమియాలా కాంగ్రెస్ కూడా పట్టు కోల్పోయినా ఉనికి కోసం పాకులాడుతోంది.
ఇక కాంగ్రెస్, టీడీపీకి చెందిన కీలక నేతలను వరుసపెట్టి పార్టీలో చేర్చుకుంటోన్న బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న పెద్ద తలకాయలను కూడా టార్గెట్‌గా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌కు చెందిన ఓ కీలక నేత, కాంగ్రెస్‌కు చెందిన ఓ ఫైర్‌బ్రాండ్ లేడీపై కన్నేసిన కమలదళం వారిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంతకు ఆ ఇద్దరు పెద్ద తలకాయలు ఎవరో కాదు. గత టీఆర్ ఎస్ ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అని టాక్. వీరితో కాషాయం పెద్దలు టచ్‌లో ఉన్నారని.. సరైన టైం చూసుకుని వీరికి కాషాయ కండువా కప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చలు నడుస్తున్నాయి.
కేసీఆర్ తొలి కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్న కడియంకు ఇప్పుడు ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. అంతే కాకుండా కుమార్తె రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆయన ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు కడియం కేవలం ఎమ్మెల్సీగా మాత్రమే ఉన్నారు. జిల్లాలో కూడా ఆయన మాటకు విలువలేదన్న టాక్ ఉంది. ఇక అటు కొండా దంపతులు ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొండా లాంటి ఫైర్ బ్రాండ్ లేడీ తమ పార్టీలో ఉండాలని బీజేపీ నేతలు బలంగా డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి సరైన హామీలతో పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు బలంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.