Breaking : ఈరోజు మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు

-

దివికేగిన దిగ్గజ నటుడ్ని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ లోకం తరలివచ్చింది. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ పార్ధివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా ప్రముఖులందరూ నివాళులు అర్పించారు. ఇవాళ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికారికంగా జరపనున్నారు. వయోభారంతోపాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్​నగర్‌‌‌‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కైకాల మరణవార్త తెలుసుకుని రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు కె.రాఘవేంద్రరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

1935 జులై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించిన కైకాల.. ‘సిపాయి కూతురు’ సినిమాతో తొలిసారి మెరిశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్​బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా మూడు తరాల హీరోల సినిమాల్లో నటించారు. 777 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి అభిమానులను సంపాదించుకున్నారు. చివరిగా ఆయన ‘మహర్షి’ సినిమాలో నటించారు. 1994లో ‘బంగారు కుటుంబం’ చిత్రానికిగాను నంది అవార్డును దక్కించుకున్నారు. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 2017లో ఫిల్మ్​ఫేర్​ లైఫ్​టైం అచీవ్​మెంట్ అవార్డును అందుకున్నారు. కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 1996లో టీడీపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version