కలియుగం… పేరులోనే అర్థం ఉంది. కలి అంటే పాపం. నాలుగుపాదాలలో మూడు పాదాలు అధర్మం, ఒక్కపాదమే ధర్మం అని పురాణాలు పేర్కొన్నాయి. ఇలాంటి కలియుగంలో నిత్యం ప్రతి ఒక్కరు తెలిసో తెలియకో పాపాలు, అసత్యాలు మాట్లాడాల్సిన పరిస్థితి. అయితే దీన్ని నివారణకు అనేక పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో అతి సులువైన పరిష్కారం తెలుసుకుందాం..
కలియుగం ప్రారంభంలో దమయంతి, నలుడు జీవితంలో అనేకానేక గాథలు ఉన్నాయి. సాక్షాత్తు మహారాజు, సర్వధర్మ ఆచరణ చేసే నలుడు సైతం కలిదోషంతో అనేక బాధలు పడుతారు. తర్వాత కాలంలో ఆయన ధర్మనిరతితో కలిదోషాన్ని జయిస్తాడు. అప్పటి నుంచి దేవతల వరం ప్రకారం ఎవరైతే కింది శ్లోకాన్ని నిత్యం చదువుకుంటారో వారు కలిదోషం నుంచి విముక్తి పొందుతారు.
‘‘కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ।
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం ॥ ’’
భావం: తపస్సుతో శక్తివంతుడైన కర్కోటకమనే పాము, దాంపత్యంలో, సత్యవంతులైన దమయంతీ-నలులు, రఘువంశానికి చెందిన రాజర్షి అయిన ఋతుపర్ణుడు- వీరి (కథ)ను కీర్తిస్తే కలిబాధ నివారణ జరుగుతుంది. కలిబాధ అంటే- ఇతరుల దుష్టత్వం వలన మనసులో ఉదయించే చెడుభావాలు, చుట్టూ ఉండే చిరాకులు, రకరకాల ఇబ్బందులు అని భావం. ఉదయాన్నే ఈ శ్లోకాన్ని ఒకసారి చదవటం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.
– శ్రీ