తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఏకగ్రీవం కావడం లాంఛనమే కానుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మహిళల్లో ఎంతో చైతన్యం రగిలించిన కవిత 2014లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె నిజామాబాద్ జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించారు. ఎంతమంది ఉద్దండులు ఉన్నా కూడా స్థానికంగా మాత్రం కవిత హవా నడిచింది. 2018 ముందస్తు సాధారణ ఎన్నికల్లో ఆమె తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కారు దూసుకుపోయేలా చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
అయితే అనూహ్యంగా సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండోసారి గెలిచినా గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కుమార్తెగా ఉండి, సిట్టింగ్ ఎంపీగా ఉండి కవిత నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఇది కవితకే కాదు.. అటు కేసీఆర్‌కు కూడా ఘోర అవమానంగా మిగిలిపోయింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. అయితే ఆమె ప్రజల్లోకి, సమావేశాల్లోకి రావాలంటే ప్రొటోకాల్ కూడా అడ్డూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఏదో ఒక పదవి ఇస్తారన్న వార్తలు గతేడాది కాలంగా వస్తున్నాయి.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇక కవితకు మంత్రి పదవి చేపట్టాలన్నా ఆశ అయితే ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. కేసీఆర్ మోడీ తొలి ప్రభుత్వంలో చేరితే కవితకు కేంద్ర మంత్రి పదవి ఖాయమనుకున్నారు. ఇక ఇప్పుడు టీఆర్ఎస్‌తో చెలిమి చేసేందుకు మోదీ, బీజేపీ సిద్ధంగా లేరు. ఇక కవితను మళ్లీ క్రియాశీలకంగా పొలిటికల్‌గా యాక్టివ్ చేసేందుకు ఆమెను మళ్లీ చట్టసభలకు పంపడమే కరెక్ట్ అని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలోనే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం ఎంతో మంది పార్టీ నేతలు ఆశ పడ్డా వారిని కాదని 15 నెలల సమయం మాత్రమే ఉన్న ఈ స్థానానికి చివరకు కవిత పేరునే ఫైనలైజ్ చేశారు. ఈ క్రమంలోనే కవితను కేసీఆర్ కేబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం మరోసారి తెరమీదకు వస్తోంది. అయితే మంత్రి పదవితో పాటు కేసీఆర్ వచ్చే యేడాది సీఎం పదవి నుంచి తప్పుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ప్రణాళికతో ఉన్నారని మరో ప్రచారం కూడా జరుగుతోంది.
కేసీఆర్ ఇక్కడ తప్పుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతే కవితకు మంత్రి పదవి కన్నా… పార్టీ పరంగా అత్యంత కీలకమైన పదవి ఆమెకు కట్టబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లాలనుకుంటే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారు. అప్పుడు ఆ ప్లేస్‌లోకి కేటీఆర్ వస్తే… కేటీఆర్ కేబినెట్ బెర్త్‌ను కవితకు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా కవితను చట్టసభల్లోకి మళ్లీ తీసుకోవడంతో కేసీఆర్ అనేక రాజకీయ చర్చలు, సందేహాలకు తావిచ్చారు. మరి ఆమె పొలిటికల్ సెకండ్ ఇన్సింగ్స్ ఎలా ఉంటుందో ? చూడాలి.
-vuyyuru subhash