విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ ఈరోజు గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణలో అమ్మవారు పంచముఖాలతో అధిష్టాన దేవతగా కనిపిస్తారు. ఈ తల్లి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణుమూర్తి, శిఖలో రుద్రుడు నివశిస్తుండగా అమ్మవారు త్రిమూర్తి స్వరూపంగా వెలుగొందుతోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించారు. శుక్రవారం కావటంతో భక్తుల రద్దీ పెరిగింది.
అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయత్రి దేవికి ఇష్టమైన పాయసం, పంచభోగాలను నైవేద్యంగా సమర్పించారు. దుర్గగుడి ప్రాంగణంలో సంప్రదాయ వాయిద్యాల హోరు ప్రతిధ్వనించింది. మరోవైపు భారీగా తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం అమ్మవారిని మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, పరిటాల సునీతలు దర్శించుకున్నారు. అర్చకులు మంత్రులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు ఆశీర్వచనం పలికారు. 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. సినీనటుడు రాజేంద్రప్రసాద్ కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు.