సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రజాస్వామ్య వాదులంతా హర్షిస్తున్నారు : కన్న బాబు

-

అమరావతి రాజధానిపై హైకోర్టు ఆదేశాలపై నేడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. పరిపాలన వికేంద్రీకరణ అంశానికి సంబంధించి ఈరోజు (సోమవారం) సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాన్ని సమర్థించేలా ఉన్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రజాస్వామ్య వాదులంతా హర్షిస్తున్నారని స్పష్టం చేశారు కన్నబాబు. మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని మొదటి నుంచి చెప్తున్నామన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో చంద్రబాబు భూములు కొనిపించారని ఆయన ఆరోపించారు. భావి తరాలకు అన్యాయం చేసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని కన్నబాబు అన్నారు. రియల్టర్లతో చంద్రబాబు అమరావతి యాత్ర చేయించారు అని అన్నారు.

ఇదిలా ఉంటే.. అమరావతిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, నెల రోజుల్లో కొన్ని పనులు, మరో 6 నెలల్లో ఇంకొన్ని పనులు చేయాలన్న కాలపరిమితులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది. అమరావతి వ్యవహారానికి సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జనవరి 31 లోపు తప్పనిసరిగా జవాబు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

అమరావతి అంశంలో వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా, తీర్పులో మరికొన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం, రైతుల తరఫున అత్యున్నత న్యాయస్థానంలో దాదాపు గంటన్నర పాటు వాదనలు కొనసాగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version