ఏపీలో కాకరేపుతున్న కాపు రాజకీయం..బెజవాడ కేంద్రంగా!

-

ఏపీలో కాపు నేతల రాజకీయం కాక రేపుతోంది..అన్నీ పార్టీల్లో ఉన్న కాపు నేతలు ఏకమయ్యేలా..కాపునాడు సభ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 26న విశాఖ వేదికగా సభ జరగనుంది. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లీడ్ చేస్తున్నారు. ఈ సభకు అన్నీ పార్టీల వారిని ఆహ్వానించనున్నారు. అలాగే కాపు నాడు విడుదల చేసిన పోస్టర్లలో చిరంజీవి, పవన్ తో పాటు అన్నీ పార్టీలకు చెందిన కాపు నేతల ఫోటోలు కూడా ఉన్నాయి.

అయితే ఈ కాపు నాడుకు వైసీపీ కాపు నేతలు వస్తారో లేదో క్లారిటీ లేదు. కానీ ఈ సభని టీడీపీ-జనసేనా-బీజేపీ కాపు నేతలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి చూస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా విజయవాడలో గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో పలువురు కాపు నేతలు మళ్ళీ భేటి అయ్యారు. బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ, టీడీపీ నేతలు బొండా ఉమ, యడం బాలాజీ సమావేశం అయ్యారు. వంగవీటి రంగా వర్ధంతి, ఇతర అంశాలపై వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తే బాగుంటుందని నేతలు మాట్లాడుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా తాజాగా నాదెండ్ల మనోహర్‌…కన్నాతో భేటీ అవ్వడం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అటు రాష్ట్రంలో పరిస్ధితులు, ఇతర అంశాలపై చర్చించామని కన్నా చెప్పారు. అలాగే ఇటీవల ప్రధాని మోదీతో పవన్ భేటీపై కూడా సమావేశంలో చర్చించారు.

రాష్ట్రంలో కాపుల పరిస్ధితిపై సమావేశంలో చర్చించి సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారని తెలిసింది. అయితే కాపు నేతలు పదే పదే భేటీ అవ్వడం వెనుక ఉన్న కారణాలు క్లారిటీ రావడం లేదు. ఇందులో వైసీపీ కాపు నేతలు జోక్యం చేసుకోవడం లేదు. అంటే టీడీపీ-జనసేన పొత్తు దిశగానే కాపు నేతల సమావేశాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version