కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హనుమంతప్ప కబ్బారా వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు. 10వేల రూపాయి నాణేలతో డిపాజిట్ సొమ్ము చెల్లించారు. వాటిని లెక్కించేందుకు ఎన్నికల అధికారులు తిప్పలు ప్డడారు. ఏకంగా బ్యాంక్ సిబ్బంది సాయం తీసుకున్నారు.
హనుమంతప్ప కబ్బారా హవేరి జిల్లాలోని రాణేబెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ఆయన బరిలోకి దిగుతున్నారు. సోమవారం రోజున హనుమంతప్ప నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉండగా.. అందుకు రూ.10 వేలు విలువైన నాణేలను అధికారులకు చెల్లించారు. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం అధికారులు.. ఎలాగోలా నాణేలను లెక్కించారు. చివరకు హనుమంతప్ప నామినేషన్ వేసేందుకు అనుమతినిచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 2023 ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 20 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. ఏప్రిల్ 21 నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు.. ఏప్రిల్ 24 ముగియనుంది. మే 10న ఎన్నికలు జరగనున్నాయి.