దీపావళి పండుగ ముగిసిన మరుసటి రోజు వచ్చేది కార్తీక శుద్ధ పాడ్యమి.కార్తీక మాసం ఆరంభం తో ఈ తిథికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజునే బలి చక్రవర్తి స్మరణతో దానాలు, ధర్మాలు చేయడం హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. విష్ణుమూర్తి వామనుడి రూపంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపినా ఆ రాజు దాన గుణాన్ని మెచ్చి ఈ రోజున భూమిపైకి వచ్చే వరాన్ని ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ దాన మహత్యం ఏమిటో? ఏ దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..
కార్తీక పాడ్యమి రోజున చేసే దానాలు అక్షయ ఫలితాలను ఇస్తాయని నమ్మకం. అంటే ఈ రోజు చేసిన దానం వలన కలిగే పుణ్యం తరగనిదిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ తిథిని బలి పాడ్యమిగా కూడా వ్యవహరిస్తారు ఎందుకంటే దాన ధర్మాలకు పెట్టింది పేరైన బలి చక్రవర్తిని స్మరించుకుంటూ ఈ దానాలు చేస్తారు. ఇది కేవలం ధన దానం మాత్రమే కాదు సేవా గుణానికి, నిస్వార్థానికి సంబంధించినది.

అన్నదానం: ఈ రోజు పేదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం అత్యంత శుభప్రదం. అన్నదానం అనేది అన్ని దానాలలోకెల్లా గొప్పదిగా పరిగణించబడుతుంది.
వస్త్ర దానం: చలి కాలం ప్రారంభమవుతుంది కాబట్టి పేదలకు కొత్త దుస్తులు లేదా దుప్పట్లు దానం చేయడం మంచిది. ఇది దాతకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ఇస్తుంది.
దీప దానం: కార్తీక మాసం అంటేనే దీపాల మాసం ఈ రోజు ఆలయాల్లో లేదా నదీ తీరాల్లో దీపాలు వెలిగించి దానం చేయడం వలన అజ్ఞానం తొలగి జ్ఞానం కలుగుతుంది.
పండ్ల దానం: పేదలు మరియు వృద్ధులకు పండ్లు లేదా ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి.
కార్తీక పాడ్యమి కేవలం పండుగ రోజు కాదు మనలోని దయ, కరుణ అనే గుణాలను మేల్కొల్పే పవిత్ర దినం. బలి చక్రవర్తి స్మరణతో మనం చేసే చిన్న దానం కూడా మన జీవితానికి గొప్ప ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. దానం చేయడం ద్వారా మన సంపద తగ్గదు మరింత వృద్ధి చెందుతుంది.
గమనిక: దానం చేసేటప్పుడు నిస్వార్థ భావంతో ప్రచార ఆకాంక్ష లేకుండా చేయాలి. దానం ఎప్పుడూ అర్హులైన వారికి అందించడం ఉత్తమం.