దేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా స్వతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి రావాల్సిన సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నట్టు తెలిసింది.
ఆయన ఎట్ హోమ్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి వస్తున్నారని రాజ్ భవన్ వర్గాలకు సీఎంవో నుంచి సమాచారం అందింది. అయితే, ఈ కార్యక్రమానికి కేసీఆర్ దూరం కాగా, సీఎస్ సోమేశ్ కుమార్, మరికొందరు ఉన్నతాధికారులు మాత్రమే ప్రభుత్వం తరఫున ఎట్ హోమ్ లో పాల్గొన్నారు. మంత్రులు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో కనిపించలేదు.