కేంద్ర అంటే చంద్రబాబుకి భయపడతారేమో..కానీ నేను భయపడను…
కాంగ్రెస్, భాజపాలు తెరాసను ఎదుర్కోలేక ఆ పార్టీల అధినేతలు పచ్చి ఆబద్దాలు ఆడతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… మొన్న ‘‘సోనియా, రాహుల్‌గాంధీలు తెలంగాణకు వచ్చి భాజపాతో తెరాస కలిసిపోయిందంటారు. ఇవాళ మోదీ వచ్చి కాంగ్రెస్‌తో కలిసిపోయాం అంటున్నారు… అసలు వాళ్లు ఎవ్వరితో కలిసి పోయారో ముందు తెలుసుకోవాలని అన్నారు. మేము ఎవరితోనూ కలవలేదు..ఈ ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొనే దమ్ము, ధైర్యం తెరాసకు ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నాయన్నారు. కేంద్రాన్ని చూసి చంద్రబాబు భయపడతాడేమో కానీ, నేను భయపడను అంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలు, అభీష్టం గెలవాలి. మనదేశంలో ఇంకా ఆ పరిపక్వత రాలేదు. కానీ రావాల్సిన అవసరం ఉందన్నారు.
దశాబ్దాల కాలంగా పాలించిన పార్టీలు చేయలేని పనులను తాము చేసి చూపించామన్నారు… వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పెంచి ఇస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశంలో ఎక్కడా లేవు. కేసీఆర్ ఉన్నంతవరకూ తెలంగాణలో రైతు బంధు పథకం ఉంటుంది తెలిపారు.
కేవలం కంటితో మిమ్మల్ని వదిలిపెట్టను..
వివిధ వర్గాల ప్రజలకు ‘‘కంటి వెలుగు పథకం ద్వారా వారి ఆరోగ్యానికి ఎంతో భరోసా కల్పించామన్నారు. కేవలం కంటితో మిమ్మల్ని వదలి పెట్టను. గొంతు, ముక్కు, పళ్ల డాక్టర్లు కూడా వస్తారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పాటు అందరికి సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలోని ప్రజలతో కలిసిపోయే నోముల నర్సింహయ్యను గెలిపించాలని ప్రజలను కోరారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్క నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 70 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశాం … రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తాం అంటూ భరోసా ఇచ్చారు.