సైకిలెక్కనున్న అహ్మదుల్లా ?

-

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా సోమవారం సీఎం చంద్రబాబును కలిశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అహ్మదుల్లా హుటాహుటిన అమరావతికి వ‌చ్చి చంద్ర‌బాబునాయుడుతో చర్చించారు. ఆయ‌న త్వ‌ర‌లో తెలుగుదేశంలో చేరుతార‌ని తెలుస్తోంది. కడప నగరానికి చెందిన కాంగ్రెస్‌ నేత రహంతుల్లా నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాన అనుచరుడు. 1976-82 మధ్య రాజ్యసభ సభ్యుడిగా, ఆ తరువాత ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కడప ఎమ్మెల్యేగా, మున్సిపల్‌ చైర్మన్‌గా గెలుపొంది జిల్లా రాజకీయాల్లో పేరు సంపాదించుకున్నారు.

ఆయన తనయుడిగా 2000 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన అహ్మదుల్లా మొదట మున్సిపల్‌ చైర్మన్‌గా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కడప నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండోసారి 2009లో మళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్‌ క్యాబినెట్‌లో రాష్ట్ర మంత్రిగా ఆ తరువాత రోశయ్య, కిరణ్‌ క్యాబినెట్‌లో కూడా మంత్రిగానే కొనసాగారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అహ్మదుల్లా ఎంతో దగ్గరగా ఉంటూ వచ్చినా వైఎస్‌ జగన్‌కు మాత్రం దూరంగానే ఉన్నారు. ఆయన తనయుడు అష్రఫ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని మరోవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. కడప అభివృద్ధి కోసమే సీఎం చంద్రబాబును కలిశాన‌ని అహ్మ‌దుల్లా మీడియాకు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి కడప సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version