ఆడవాళ్లకే ఎందుకు..? జపాన్‌ మహిళల వింత ఉద్యమం..!

-

మహిళల హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతుంటాయి. కానీ జపాన్ లో ఇప్పుడు ఓ వింత ఉద్యమం సాగుతోంది. అదేంటంటే.. కళ్లద్దాలు పెట్టుకోవడం మా హక్కు అంటూ జపాన్ మహిళలు ఉద్యమిస్తున్నారు. తమ ఉద్యమాన్ని ట్విటర్ వేదికగా #Glasses ban హ్యాష్ టాగ్ తో ఉధృతం చేస్తున్నారు. ఇప్పుడు జపాన్ లో ఇదో హాట్ టాపిక్.

అసలు ఈ ఉద్యమం ఏంటి.. ఎందుకు..దీని నేపథ్యం ఏంటి.. తెలుసుకుందాం.. తాజాగా జపాన్ లో కొన్ని సంస్థలు తమ ఉద్యోగినులను కళ్లద్దాలు వాడవద్దని రూల్స్ పెట్టాయి. మహిళలు తప్పనిసరిగా కళ్లద్దాల బదులు కాంటాక్ట్ లెన్సులే వాడాలట. పురుషులకు మాత్రం ఇలాంటి నిబంధనలేదు. దీంతో మహిళలు గళమెత్తారు. మాకు మాత్రమే ఈ రూల్ ఎందుకని నిలదీస్తున్నారు.

కాంటాక్ట్ లెన్సులు ధరించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని, కంటి సంబంధిత ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందని ఉద్యోగినులు ఆందోళన చెందుతున్నారు. కేవలం మహిళలకే ఇలాంటి రూల్స్ పెట్టడం తప్పకుండా లింగవివక్ష కిందకే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఉద్యమానికి అక్కడి నటి, రచయిత యుమీ ఇషిక్వా వంటి సెలబ్రెటీలు కూడా తమ మద్దతు తెలిపారు. పని ప్రదేశాల్లో కళదాలు ధరించకూడదనే నిబంధన తీసుకురావాలనుకుంటే… అది అందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఆడవారికే అనడంలో అర్థం లేదంటున్నారు. ఒకప్పుడు ఎత్తుమడమల చెప్పులు వేసుకునే పనికి రమ్మన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రోజంతా వాటిని వేసుకోవడం ఎంత కష్టమో ఆడవారికే తెలుసు.

మళ్లీ ఇప్పుడు ఇలా కళ్లద్దాల నిబంధన పెట్టడం దారుణమని జపాన్ మహిళలు ఉద్యమిస్తున్నారు. ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం ఎంత కష్టమో… రోజంతా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని పనిచేయడమూ అంతే ఇబ్బంది..అంటూ తమ ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మరి ఈ ఉద్యమం ఎంతవరకూ సక్సస్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version