తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అయితే, తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన గొప్పతనం ఐటీ మంత్రి కేటీఆర్‌ది అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఐటీ హబ్ ఏర్పాటుకు మూలం కేసీఆర్, కేటీఆరే కారణమన్నారు. సూర్యాపేటలో త్వరలో ప్రారంభం కానున్న ఐటీ హబ్‌కు గాను టాస్క్ ఆధ్వర్యంలో ఐటీ కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి యువతను ఎంకరేజ్ చేశారు. ఉద్యమ సమయంలో చేసిన ఉపన్యాసాలు నేడు నిజం అయ్యాయని, 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ విజన్ దేశానికే రోల్ మోడల్ అన్నారు. ప్రపంచ దేశాలను ప్రభావితం చేయగల విజ్ఞానం, పరిపాలన దక్షిత కేటీఆర్ సొంతం అన్నారు.
ఎమ్మెల్సీల తిరస్కరణపై గవర్నర్ తమిళిసై చెబుతున్న సాకులు గురువింద సామేతను గుర్తుకు తెస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యకురాలుగా ఉన్నారన్నారు. బీజేపీ నుండి గవర్నర్ గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదన్నారు జగదీష్ రెడ్డి. తిరస్కరణ నీతితో ఆమె కూడా గవర్నర్ పదవికి అర్హురాలు కాకుండా పోతుందన్నారు. నీతులు చెప్పే గవర్నర్ నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామని జగదీష్ రెడ్డి అన్నారు.