ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు మరింత తీవ్రరూపం దాల్చింది. సగానికి పైగా బస్సులు డిపోలకు పరిమితం అయ్యాయి. విపక్ష పార్టీలు సైతం ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తూ, నిరసనలకు దిగుతున్నాయి. ఓ వైపు సమ్మె కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే, కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా నేడు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టీసీలో అద్దె బస్సుల నోటిఫికేషన్, రూట్ల ప్రైవేటీకరణపై ప్రధానంగా చర్చించనున్నారు. వీటితో పాటు నూతన ఉద్యోగుల నియామకం, మార్గదర్శకాల రూపకల్పనపై ఈ సమావేశంలో సీఎం చర్చించనున్నారు.