ఆర్టీసీ సమ్మెను ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఏర్పాట్లు ఇవీ..!

-

ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతున్నాయి. అయితే పండుగ సమయంలో బస్సులు నడపకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం ఆర్టీసీలో పదివేల బస్సులు ఉన్నాయి. ఇందులో 2100 బస్సులు ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు. వీటి డ్రైవర్లు ప్రైవేటు వారే కాబట్టి వీటిని తప్పనిసరిగా నడుపుతారు.

ఇవి కాకుండా మరో ఐదు వేల మంది తాత్కాలిక డ్రైవర్లుగా చేయడానికి ముందుకు వచ్చారని అధికారులు చెబుతున్నారు. దీంతో 7వేలకు పైగా బస్సులు నడపడం సాధ్యమతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా ఆర్టీసీలో మైలేజ్ అయిపోయిన 2,600 బస్సుల స్థానంలో అద్దె బస్సులు తీసుకోవాలని, శనివారమే ఇందుకోసమే నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇప్పటికిప్పుడు ప్రజల అసౌకర్యాన్ని వీలయినంత తగ్గించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు తెప్పించాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేషన్లపై కాస్త ఉదారంగా ఉండాలని చెప్పారు. ప్రైవేటు వాహనాలకిచ్చే పర్మిట్ రుసుంలో 25 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ఇవే కాకుండా సరిహద్దులో ఉన్న జిల్లాలకు దాని సరిహద్దులో ఉన్న రాష్ట్రాల నుంచి ప్రైవేటు బస్సులను తెప్పిస్తున్నారు.

పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలతో మాట్లాడి వారి సర్వీసులను పెంచుతున్నారు. యుద్ధప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను టెంపపరీగా తీసుకుంటున్నారు. బస్సు డిపోల వద్ద భద్రత కల్పించాలని, బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సిఎం ఆదేశించారు. మెట్రో రైలు ట్రిప్పుల సంఖ్య పెంచుతున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా పెంచుతున్నారు. కానీ ఎన్ని చేసినా ఆర్టీసీ సేవలకు ప్రత్యామ్నాయంగా సాటి రాగలవా అన్న సందేహం లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version