తెలంగాణ నూతన జోనల్ విధానం లో.. భార్య భర్తల బదిలీల మార్గదర్శకాలపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీలో ఉద్యోగ దంపతుల్లో ఒక్కరు దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఒకరు పనిచేసే చోటులో మరొకరికి లేదా కొత్త స్థలంలో ఇద్దరికీ పనిచేసే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు, ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.
దీనివల్ల స్పౌస్ కేటగిరిలో… బదిలీ కోరుకునే వారికి మరింత వెసులుబాటు రానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోనల్, బహుళ జోన్లకు సంబంధించి దాదాపు 6500 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఉదాహరణకు నిజామాబాద్ లో పనిచేసే భార్య… కామారెడ్డి లో పనిచేసే భర్త వద్దకు బదిలీ కోరుతున్నారు.
ప్రభుత్వానికి ఇచ్చిన దరఖాస్తులు ఎక్కువభాగం ఇలాంటివి ఉన్నాయి. భార్య పనిచేసే చోటుకు భర్త బదిలీ కోరుతున్న వారి సంఖ్య తక్కువ అని చెప్పాలి. ఈ ప్రాతిపదికన దాదాపు 10 శాతం మందికి బదిలీలకు అవకాశం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల బదిలీలకు మరింత వెసులుబాటు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.