కరీంనగర్: మాజీ మంత్రి ఈటల ఎఫెక్ట్ ఆయన అనుచరులపై పడింది. ఈటలకు మద్దతుగా నిలిచిన వారు టార్గెట్ అయ్యారు. వారి కున్న లోపాలు, లోసుగులను వెతుకుతున్నారు. వివరణ కోసం నోటీసులు ఇస్తున్నారు. తాజాగా ఈటల కీలక అనుచరుడు, వీణవంక జడ్పీటీసీ భర్త సాదవ రెడ్డికి కేడీసీసీ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. సాదవ రెడ్డి సింగిల్ విండో ఛైర్మెన్‌గా పని చేశారు. ఆ సమయంలో నిధులు గోల్‌మాల్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 18 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని గురువారం కేడీసీసీ బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. ఈ నోటీసులపై సాదవ రెడ్డి స్పందించారు. ఈటలకు అనుచరుడిగా ఉన్నందునే కక్ష కట్టి నోటీసులు పంపించారన్నారు. తాను అవినీతికి పాల్పడలేదని చెప్పారు. మూడేళ్ళ నాటి ఇష్యూను ఇప్పుడు తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యానించారు. ఆ డబ్బులతో తనకు ఎలాంటి సంబంధం లేదని సాదవ రెడ్డి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మంత్రి పదవి నుంచి రాజేందర్‌ను తొలగించడాన్ని ఆయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటలను కేబినెట్‌లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈటల స్వగ్రామం కమలాపూర్‌లో ఆయన అభిమానులు, అనుచరులు నిరసనకు దిగారు. చెరువులోకి దిగి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈటలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ కలిసి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.