దిల్లీ లిక్కర్ స్కామ్లో నగదు అక్రమ చలామణి కేసులో విచారించేందుకు సీఎం కేజ్రీవాల్‌కు పలుమార్లు సమన్లు జారీచేసినా ఆయన హాజరుకావడం లేదని ఈడీ మరోసారి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్కు మళ్లీ సమన్లు జారీ చేసింది. మార్చి 16వ తేదీన తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు పంపింది. అయితే ప్రతిసారి ఆయన వాటిని తిరస్కరిస్తూ వస్తున్నారు. మొదటి మూడుసార్లు సమన్లకు ఆయన స్పందించలేదని గత నెల కోర్టులో ఫిర్యాదు చేయగా అప్పుడు విచారణ జరిపి ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో అసెంబ్లీ విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్‌గా హాజరైన సీఎం.. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతాని అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. అయితే ఈ అంశం కోర్టులో పెండింగ్ ఉండగానే ఈడీ ఆయనకు మరిన్ని సమన్లు జారీ చేసి మరోసారి కోర్టును ఆశ్రయించింది.