దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 21 రోజుల లాక్‌డౌన్‌లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మద్యం ప్రియులకు మద్యం లభించడం లేదు. దీంతో చాలా చోట్ల ఆల్కహాల్ అడిక్ట్స్ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. కేరళలో అయితే ఇలాంటి వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ కొందరు మద్యం తాగక చనిపోయారు. కొందరిని అక్కడి డీ అడిక్షన్ సెంటర్లకు తరలించారు. అయితే అదే రాష్ట్రంలో ఇప్పుడొక డాక్టర్.. ఓ పేషెంట్‌కు.. మద్యం తాగమని చెప్పి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళలోని నార్త్ పరవుర్ కొడుంగల్లూర్‌లో డాక్టర్ ఎండీ రెంజిత్ అనే వైద్యుడు 48 ఏళ్ల పురుషోత్తం అనే తన పేషెంట్‌కు మద్యం తాగమని చెప్పి ఏకంగా ప్రిస్క్రిప్షన్‌నే రాశాడు. అందులో రోజుకు 3 సార్లు.. పూటకు 60ఎంఎల్ బ్రాందీ, సోడాతో కలిపి తాగమని, స్టఫ్ కింద వేయించిన పల్లీలు తినమని.. రాశాడు. దీంతో ఆ ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో మద్యానికి బానిసైన వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేర మద్యాన్ని అమ్మాలనే ఓ ప్రతిపాదన ఉందని తెలిసిన కొద్ది గంటలకే.. ఈ ప్రిస్క్రిప్షన్ వైరల్ కావడంతో జనాలు దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై సదరు డాక్టర్‌ను వివరణ కోరగా.. తాను ఆ ప్రిస్క్రిప్షన్‌ను రాసిన మాట నిజమే అయినా.. అది వట్టి జోక్ మాత్రమేనని.. అందులో నిజం లేదని.. అసలు తనకు పురుషోత్తం అనే పేషెంట్ ఎవరూ లేరని.. కేవలం అందర్నీ నవ్వించడానికి చేసిన ప్రయత్నమేనని.. అందుకు తాను సారీ చెబుతున్నానని… ఆ డాక్టర్ తెలిపాడు. దీంతో ఇప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్‌ను చూసి జనాలు అందరూ నవ్వుకుంటున్నారు. అయితే జోక్ కాకపోయినప్పటికీ.. నిజానికి మద్యానికి బానిసైన వారి పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో అలాంటి వారి ఆరోగ్యంపై ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!