ఆన్‌లైన్ ర‌మ్మీ.. విరాట్ కోహ్లి, త‌మ‌న్నాల‌కు కేర‌ళ హైకోర్టు నోటీసులు..

-

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, న‌టి త‌మ‌న్నా, అజు వ‌ర్ఘీస్‌ల‌కు కేర‌ళ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ ర‌మ్మీకి వారు ప్ర‌చార క‌ర్త‌లుగా ఉన్నార‌ని, వారి వ‌ల్ల యువ‌త ఈ త‌ర‌హా యాప్‌ల‌కు వ్య‌స‌న‌పరులుగా మారుతున్నార‌ని, క‌నుక ఆ యాప్‌లతోపాటు స‌ద‌రు ప్రచార క‌ర్త‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఓ బాధితుడు కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించాడు. దీంతో హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.

ఆన్‌లైన్ ర‌మ్మీ యాప్‌ల‌కు కోహ్లి, త‌మ‌న్నాలే కాదు, ప‌లువురు ఇత‌ర సెల‌బ్రిటీలు కూడా ప్ర‌చార క‌ర్త‌లుగా ఉన్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా యాప్‌లకు వ్య‌స‌న‌ప‌రులుగా మారి కొంద‌రు ల‌క్ష‌ల రూపాయాల‌ను పోగొట్టుకోవ‌డంతోపాటు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఈ మ‌ధ్యే తిరువ‌నంత‌పురంకు చెందిన వినీత్ అనే వ్య‌క్తి రూ.21 ల‌క్ష‌ల‌ను ఆన్‌లైన్ ర‌మ్మీలో పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపం చెంది ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కాలంలో అనేకం జ‌రిగాయి.

కాగా ఈ విష‌యంపై ఫిర్యాదు చేసిన స‌జీష్ అనే 32 ఏళ్ల వ్య‌క్తి మాట్లాడుతూ.. తాను ఆన్‌లైన్ ర‌మ్మీ ద్వారా రూ.6 ల‌క్ష‌ల‌ను పోగొట్టుకున్నాన‌ని తెలిపాడు. సెల‌బ్రిటీలు ప్ర‌చార‌క‌ర్త‌లుగా ఉండ‌డం వ‌ల్ల ఈ యాప్‌ల‌కు యువ‌త ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతున్నార‌ని, ఆ యాప్‌ల ప‌ట్ల వ్య‌స‌న‌పరులుగా మారుతున్నార‌ని, దీంతో ల‌క్ష‌ల రూపాయాల‌ను పోగొట్టుకుంటూ, బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, క‌నుక ఆ యాప్‌ల‌తోపాటు వాటికి ప్ర‌చారం నిర్వ‌హించే సెల‌బ్రిటీల‌పై కూడా చ‌ర్యలు తీసుకోవాల‌ని తాను కోర్టులో వేసిన పిటిష‌న్‌లో కోరిన‌ట్లు తెలిపాడు. అయితే ఆ నోటీసుల ప‌ట్ల వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version