ఇటీవల ఏపీ సర్కారు పై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో ఐదేళ్లలో ఉపాధ్యాయులకు 73% ఫిట్మెంట్ ఇచ్చామని వివరించారు. అలాగే ఏపీ సీఎం జగన్ లాగా కేంద్రం షరతులకు ఒప్పుకొని ఉంటే.. ఏటా రు ఆరువేల కోట్లు అప్పులు తీసుకుని మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే వారమని చెప్పారు.
అయితే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించారు. ఏపీ భవన్ లో అధికారిని హరీష్ రావు ఎలా తన్నారో అందరూ చూశారని ఆయన ఎద్దేవా చేశారు. హరీష్ రావు, సీఎం కేసీఆర్ మధ్య ఏవైనా గొడవలు ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలని అన్నారు. గడిచిన మూడేళ్లలో ఏపీకి తమ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసని అన్నారు. 8 ఏళ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.