వివిధ నేరాలు చేసి జైలుకు వెళ్లిన కొందరు అనుకోకుండా శిక్ష అనుభిస్తున్న కాలంలోనే మరణిస్తుంటారు. అందులో కొన్ని సహజ మరణాలు ఉంటే మరికొన్ని అసహజ మరణాలు ఉంటాయి. అయితే, జైలులో శిక్ష అనుభవిస్తున్న టైంలో ఎవరైనా మరణిస్తే వారికోసం, వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖైదీలు మరణిస్తే వారికి అందించే పరిహారంపై రాష్ట్ర హోంశాఖ కీలక ఉత్తర్వులిచ్చింది.
అది కూడా అసహజ మరణాలకు మాత్రమే అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనగా జైలులో తోటి ఖైదీలతో ఘర్షణ, జైలు సిబ్బంది వేధింపులతో ఎవరైనా ఖైదీ మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు. జైలు అధికారులు, వైద్యుల నిర్లక్ష్యంతో ఖైదీ చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా రూ.3.5లక్షలు చెల్లిస్తారు.సహజ మరణం, అనారోగ్యం, తప్పించుకుని పారిపోయి చనిపోతే ఈ పరిహారం వర్తించదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిబంధనలను ఏపీ హోంశాఖ రూపొందించింది.