ఓ సర్పంచ్ కుటుంబం దారుణ హత్యకు గురైతే ఊరి జనం గ్రామసభ నిర్వహించి ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని తీర్మానించారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌లోని కుంటీ జిల్లా అడ్కీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదెలెబె గ్రామంలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
బుధవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు గ్రామ సర్పంచ్ ముడా ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం పదునైన పొడవాటి ఆయుధంతో దాడి చేసి చంపేశారు. సర్పంచ్ కుమారుడు సింగా, కోడలు సిదిమా దేవిని కూడా దారుణంగా హత్య చేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులకు తెలియజేయలేదు. బుధవారం మొత్తం మృతదేహాలు ఇంట్లోనే ఉన్నాయి. గ్రామస్థులు రోజంతా గ్రామ సభ నిర్వహించి, ఘటన గురించి పోలీసులకు ఎవరూ చెప్పొద్దంటూ తీర్మానించారు. కుటుంబ సభ్యులు కూడా చెప్పకూడదంటూ వారిని బెదిరించారు.
వారి మాటలు లెక్కచేయని మృతుల బంధువు బీనాదేవి.. మంగళ్ అనే సామాజిక కార్యకర్తకు ఈ విషయం చెప్పింది. అతడు పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అది నక్సల్ ప్రభావిత ప్రాంతమని, ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తారని ఎస్పీ తెలిపారు.