దేశంలో మహిళల మీద అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణాలోని వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన వికారాబాద్ లో కిడ్నాప్ కలకలం రేగింది. వికారాబాద్ ఎమ్మార్పి చౌరస్తా సమీపంలో అక్కా చెల్లెళ్ళు నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చెల్లిని కారులోకి లాక్కొని అక్కడి నుండి పారిపోయారు. సదరు యువతి వికారాబాద్ కు చెందిన ఓ మెడికల్ షాపు యాజమాని కూతురు అని తెలుస్తోంది. చెల్లి కిడ్నాప్ కావడంతో అక్క షాక్ కి గురయింది.
తేరుకున్నాక ఆమె కుటుంబీకులకి తెలపడంతో వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు కావడంతో పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కిడ్నాప్ కు పాల్పడిన దుండగులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏమయినా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా ? లేక ఆమె తండ్రికి ఎవరయినా శత్రువులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు.