ప్రధాని మోడీ కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ఏటా రూ.6వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ పథకంపై ఇప్పటికే ప్రకటన చేసి వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.2వేలను రైతులకు ఇవ్వనున్నారు. ఏడాదికి మొత్తం మూడు దఫాల్లో తడవకు రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలను రైతులకు ఇవ్వనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ఫెర్టిలైజర్ గ్రౌండ్‌లో కిసాన్ మహా ఆదివేషన్ పేరిట ఈ నెల 23న భారీ రైతు మహాసభను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. అందులో భాగంగా సభ ఏర్పాట్లను ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ బన్సల్, జోనల్ ఉపాధ్యక్షుడు సత్యేంద్ర సిన్హాలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తాజాగా పర్యవేక్షించారు. 23వ తేదీన ప్రారంభం కానున్న సభ 24వ తేదీన కూడా కొనసాగనుండగా, అదే రోజు ప్రధాని మోడీ కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక ముందు రోజు.. అంటే 23వ తేదీన సభను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభిస్తారు.
కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా తొలి ఇన్‌స్టాల్‌మెంట్ కింద రైతులకు రూ.2వేలను ఇస్తామని బీజేపీ నాయకులు వెల్లడించారు. కాగా పథకం ప్రారంభం సందర్భంగా ఎంత మంది రైతులకు నగదును ఇవ్వనున్నారనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. అయితే దీనిపై సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్ యాదవ్ స్పందిస్తూ… 2016లో ఇదే ఫెర్టిలైజర్ గ్రౌండ్‌లో మోడీ గోరఖ్‌పూర్‌లో రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని అన్నారు. ఎయిమ్స్, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలకు మోడీ అప్పట్లో శంకుస్థాపనలు చేసినా.. నేటికీ ఆ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు. కాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి కాపీ అన్న విషయం తెలిసిందే..!