కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కాన్ని తెలంగాణ నుంచే అమ‌లు చేస్తార‌ట‌..?

-

తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని రైతుల కోసం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రైతు బంధు ప‌థ‌కాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్న విష‌యం విదిత‌మే. కాగా ఇదే ప‌థ‌కాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కూడా మొన్నీ మ‌ధ్యే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకేఎస్‌ఎన్) పేరిట ఓ కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కం తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌క‌మైన రైతు బంధుకు కాపీయే. అయితే కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కాన్ని ఇప్పుడు తెలంగాణ నుంచే మొద‌ట‌గా అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలిసింది.

తెలంగాణ‌లో ఇప్ప‌టికే రైతు బంధు ప‌థ‌కం అమ‌ల‌వుతున్నందున ఇక్క‌డి నుంచే కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేస్తే బాగుంటుంద‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు కూడా తెలిసింది. ఎందుకంటే… తెలంగాణ‌లో రైతు బంధు ప‌థ‌కానికి చెందిన ల‌బ్దిదారుల స‌మాచారం అంతా రెడీగా ఉంది. దాన్ని కేంద్ర ప్ర‌భుత్వానికి ఇవ్వ‌డ‌మే త‌రువాయి, ఆ ప‌థ‌కం కూడా వెంట‌నే అమ‌లవుతుంది. ఇత‌ర రాష్ట్రాల్లో ఈ ప‌థ‌కం ప్రారంభించాలంటే.. అక్క‌డ ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేయాలి క‌దా. అందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. కానీ తెలంగాణ‌లో అలా కాదు. ఇప్ప‌టికే రైతు బంధు ద్వారా ల‌బ్ది పొందుతున్న వారి వివ‌రాలు ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్నాయి. వాటిని తీసుకుంటే వెంట‌నే కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌వ‌చ్చు. అందుకే కేంద్రం తెలంగాణ నుంచే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తుంద‌ట‌.

కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం 2018 డిసెంబ‌ర్ నుంచే అమ‌లులోకి వ‌చ్చింద‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. కాగా ఈ ప‌థ‌కం కోసం కేంద్రం రూ.75వేల కోట్ల నిధుల‌ను కూడా ఇప్ప‌టికే బ‌డ్జెట్‌లో కేటాయించింది. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రైతుకు ఆర్థిక మ‌ద్ద‌తు కింద కేంద్ర ప్ర‌భుత్వం రూ.20వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌నుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న 12 కోట్ల మంది రైతుల‌కు ల‌బ్ది చేకూరుతుంది.

ఇక తెలంగాణ ప్ర‌భుత్వం రైత బంధు ప‌థ‌కం ద్వారా రైతుకు ఏడాదికి రూ.8వేలు ఇస్తుండగా, కేంద్రం రూ.6వేల‌ను ఇవ్వ‌నుంది. ఎక‌రానికి రూ.4వేల చొప్పున రెండు విడ‌త‌ల‌కు క‌లిపి మొత్తం రూ.8వేల‌ను తెలంగాణ‌లో రైతుల‌కు చెల్లిస్తున్నారు. కానీ కేంద్ర ప‌థ‌కం మూడు విడ‌త‌ల్లో విడ‌త‌కు రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేల‌ను చెల్లించ‌నుంది. ఇక కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కేవ‌లం 5 ఎక‌రాల లోపు భూమి ఉన్న రైతుల‌కే వ‌ర్తిస్తుంది. కానీ రైతు బంధును అంద‌రికీ వ‌ర్తింప‌జేస్తున్నారు. కాగా కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం పొందాలంటే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు అయి ఉండ‌రాదు. నాలుగో త‌ర‌గ‌తి ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. ఆదాయ‌పు ప‌న్ను క‌ట్టే వారు ఈ ప‌థ‌కానికి అన‌ర్హులు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కూడా ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌దు. ఈ ప‌థ‌కాన్ని పొందాలంటే రైతుగా ధ్రువీక‌ర‌ణ అయి ఉండాలి. త‌ప్పుడు ప‌త్రాల‌తో ల‌బ్ది పొందితే చట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version