తెలుగుదేశం పార్టీ నాయకుడు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరనున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆమంచి వైసీపీలో చేరిక నేడో రేపో అన్నట్లు మారింది. అయితే ఆశ్చర్యంగా ఆయన నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యాక తన నిర్ణయాన్ని ప్రకటించడం వాయిదా వేసుకున్నారు. చంద్రబాబు చెప్పిన దాన్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని అన్నారు.
ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గత కొద్ది సేపటి కిందటే సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆమంచి తన నియోజకవర్గంలో పరిస్థితిని గురించి చంద్రబాబుకు వివరించారు. ఇరువురూ సుమారుగా 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అంతకు ముందు ఆమంచిని మంత్రి శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లారు. గత కొంత కాలంగా టీడీపీలో ఆమంచి అసంతృప్తితో ఉండగా, ఆయన వైసీపీలో చేరుతారనే వార్తలు దాదాపుగా ఖాయమయ్యాయి. కానీ సీఎం చంద్రబాబుతో చర్చించాక తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు.
ఆమంచి కృష్ణమోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో అబివృద్ధి జరిగిన విషయం నిజమే అయినప్పటికీ పార్టీలో తాను ఇమడలేకపోతున్నాని అన్నారు. తనపై ఇతర నాయకులు విమర్శలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానన్నారు. ఇవే విషయాలను చంద్రబాబుకు చెప్పానన్నారు. ఈ క్రమంలోనే ఆయన వెల్లడించే నిర్ణయాన్ని బట్టి తన రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇక చంద్రబాబుతో ఆమంచి నిన్ననే సమావేశం కావల్సి ఉన్నా అది నేటికి వాయిదా పడింది. చీరాలలో ఆమంచి రాజకీయ ప్రత్యర్థులకు రెండు పదవులు దక్కడంతో ఆమంచి అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన టీడీపీని వీడేందుకు సిద్ధపడ్డారు. అయితే చంద్రబాబు, లోకేష్‌ల జోక్యంతో మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తదితరులు ఆమంచితో చర్చలు జరిపారు. దీంతో ఆమంచి పార్టీ మారే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. త్వరలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.