మీకు దగ్గర్లో ఉండే రేషన్‌ షాపు గురించి ఈ యాప్‌లో సులభంగా తెలుసుకోండి..!

-

దేశంలోని రేషన్‌ కార్డు దారుల కోసం కేంద్ర ప్రభుత్వం వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు పేరిట వినూత్న కార్యక్రమాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. దీని వల్ల ఎంతో మందికి లబ్ది కలుగుతోంది. స్థిరంగా ఒక చోట ఉండని కార్మికులు ఈ పద్ధతి ద్వారా ఎక్కడంటే అక్కడ రేషన్‌ సరుకులను తీసుకునేందుకు వీలు ఏర్పడింది. అయితే రేషన్‌ కార్డు దారులకు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం కేంద్రం మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని ఏప్రిల్‌ 12వ తేదీ వరకు సుమారుగా 5 లక్షల మంది వాడుతున్నట్లు కేంద్రం తెలియజేసింది.

మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్ల వినియోగదారులకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇందులో రేషన్‌ కార్డు దారులు రిజిస్టర్‌ చేసుకుని ఉపయోగించవచ్చు. దీని ద్వారా తమకు సమీపంలో ఉండే రేషన్‌ షాపుల వివరాలు, వాటిల్లో లభించే సరుకులు వంటి వివరాలు లభిస్తాయి. అలాగే కొత్తగా రేషన్‌ కార్డు కోసం అప్లై చేస్తే దాని స్టేటస్‌ గురించి కూడా ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఇక రేషన్‌ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా, యాప్‌ పరంగా ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా అందులో ఫీడ్‌ బ్యాక్‌ పంపించవచ్చు. దీంతో సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. రేషన్‌ కార్డు దారుల సమస్యలను పరిష్కరిస్తారు.

దేశంలో సుమారుగా 69 కోట్ల మంది రేషన్‌ కార్డు దారులు ఉండగా ప్రస్తుతం 5 లక్షల మంది ఈ యాప్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరింత మంది ఈ యాప్‌ను వినియోగించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. ఇక ఈ యాప్‌ ద్వారా అందే ఫిర్యాదులను కేంద్ర పౌర సరఫరాల శాఖ స్వయంగా పరిష్కరించేందుకు కృషి చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version