కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపామని, అది సరిపోతుందని, ఇప్పుడు దేశంలో కోవిడ్ కు వ్యతిరేకంగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 385 రోజుల తరువాత కూడా కోవిడ్‌పై ఇంకా విజయం సాధించకపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ కోవిడ్ వ్యాక్సిన్‌పై చేపట్టిన ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గతేడాది మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించారని, ప్రజలందరూ చప్పట్లు కొట్టారని, వంట పాత్రలను మోగిస్తూ హెల్త్‌కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారని అన్నారు. ఇక ప్రస్తుతం టీకా ఉత్సవ్ పేరిట టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని, కానీ టీకాలకు కొరత ఉందని రాష్ట్రాలు చెబుతున్నాయని, కనుక చప్పట్లు కొట్టడం, గిన్నెలు మోగించడం వంటి పనులను ఇకనైనా ఆపి దేశంలో అందరికీ కోవిడ్ టీకాలు అందేలా చూడాలన్నారు.
విదేశాలకు కోవిడ్ టీకాలను ఎగుమతి చేయడం ఆపాలని రాహుల్ గాంధీ అన్నారు. కరోనాపై 18 రోజుల్లో విజయం సాధిస్తామని మోదీ చెప్పారని, కానీ ఇప్పటికీ కోవిడ్ ముప్పు పోలేదని విమర్శించారు. ఈవెంట్‌బాజీ చేయడం ఆపి ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందేలా చూడాలని, అప్పుడే కోవిడ్ ముప్పు తప్పుతుందని అన్నారు.