బెజవాడలో రమేష్ హస్పిటల్ వివాదం ఇప్పుడు కులం రంగు పులుముకుంటున్న సంగతి తెలిసిందే. రమేష్ హాస్పిటల్ ని అన్యాయంగా బలి చేస్తున్నారని నటుడు రామ్ పెట్టిన ట్వీట్… ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చకే దారి తీసింది. ఇప్పుడు రామ్ కి మంత్రి కొడాలి నాని వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ రమేష్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సెంటర్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఈరోజు పంపిణీ చేశారు. బాధిత కటుంబాలకు మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి, వెల్లంపల్లి, కొడాలి నాని చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా విజయవాడ రమేష్ హాస్పిటల్ యజమాని రమేష్ వెనుక అనేక మంది బడా నాయకులు ఉన్నారని కొడాలి నాని అన్నారు. రమేష్‌ను చంద్రబాబు తన ఇంట్లోనే దాచుకున్నారని ఆరోపించారాయన. ప్రతిపక్షాలు డిమాండ్ చేయకపోయినా ఘటనకు కారణమైన వారిపై చర్యలకు ఆదేశించామని అన్నారు. రమేష్ ఎక్కడ ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్న ఆయన హీరో రామ్ ఆయన మాటలు వినకుండా జాగ్రత్త పడితే మంచిదని హెచ్చరించారు. ఏ కులం మీద అయినా కక్ష సాధించాల్సిన అవసరం సీఎం జగన్‌కు లేదన్నారు నాని. రమేష్ ఏ తప్పూ చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావట్లేదని ఆయన ప్రశ్నించారు.