స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో మాచర్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి జరగడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయం గురించి చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి వీడియోలు చూపిస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా లేదా?.., పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారారు అని మండిపడ్డారు. కోపంతో మరియు ఆవేశంతో ఉగిపోయి డీజీపీ కార్యాలయానికి అరగంటపాటు పాదయాత్ర చేసి బైఠాయించారు.., పోలీసు అధికారులు లోపలకు రావాలని కోరినా తిరస్కరించి రోడ్డుపైనే కూర్చుని చంద్రబాబు చేసిన హంగామాకు నివ్వెరపోవడం జనాల వంతు అయింది.
ఇదే తరుణంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలకు వైసీపీ పార్టీ నేతలు..ఆనాడు సాక్షాత్తు మా అధ్యక్షుడు వైయస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తి చేత దాడి చేయించింది ఎవరో అందరికీ తెలుసు, సరిగ్గా విచారణ చేయిస్తే చంద్రబాబు అడ్డంగా దొరకటం గ్యారెంటీ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. అప్పటినుండే చంద్రబాబు రాజకీయ అభద్రతాభావంతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని రకరకాల కుయుక్తులు వేశారు అంటూ చంద్రబాబు చేస్తున్న కామెంట్లకు కౌంటర్లు వేశారు. దీంతో పల్నాడు గొడవ అడ్డంపెట్టుకుని రాజకీయ సానుభూతి పొందాలని సాధించిన చంద్రబాబు మెడకి కోడి కత్తి కేసు గుచ్చుకున్నట్లు అయ్యింది.