టీం ఇండియాలో ఆడిన ఆడకపోయినా సరే ఎక్కువగా అవకాశాలు దక్కించుకున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కెఎల్ రాహుల్. ఆడితే అతి వృష్టి ఆడకపోతే అనావృష్టి. మూడు ఫార్మాట్లలో కూడా రాహుల్ ప్రదర్శన ఇదే విధంగా ఉంది. ప్రతిభ ఉన్నా సరే నిలకడ లేక అవస్థలు పడుతూ ఉంటాడు. అందుకే కోహ్లీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రాహుల్ కి అనేక అవకాశాలు ఇస్తూ జట్టులో అతని స్థానాన్ని పదిలం చెయ్యాలని చూస్తున్నాడు.
27 ఏళ్ళ ఈ కర్నాటక ఆటగాడు ఇప్పటికే తాను హిట్టర్ గా, టెస్ట్ ప్లేయర్ గా నిరూపించుకున్నాడు. అయితే అతని స్థానం విషయంలో మాత్రమే స్పష్టత రావడం లేదు. ప్రపంచకప్ లో ధావన్ లేకపోవడంతో రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేసాడు రాహుల్. ఆ టోర్నీలో అతను ప్రతీ మ్యాచ్ దాదాపు బాగానే ఆడాడు. ఇక అప్పటి నుంచి కోహ్లీ అతనికి అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. మూడో స్థానంలో రాహుల్ ని ఆడించాలి అనేది కోహ్లి కోరిక.
అందుకోసం ఇప్పటికే అనేక ప్రయత్నాలు కూడా చేసాడు. ఇప్పుడు ఇక ఈ విషయంలో వెనక్కు తగ్గవద్దని భావిస్తున్నాడు కోహ్లి. ఆసిస్ తో వన్డే సిరీస్ లో ముగ్గురు ఓపెనర్లను బరిలోకి దించే ఆలోచన చేస్తున్నాడు. రాహుల్ అవసరమైతే కీపింగ్ కూడా చేస్తాడు. అందుకే తాను ఒక స్థానం దిగి నాలుగో స్థానంలో ఆడి రాహుల్ ని మూడో స్థానంలో పంపించాలని భావిస్తున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియా తో జరిగే తొలి వన్డేలో రాహుల్ మూడో స్థానంలో రానున్నాడు.