ఇటీవలే ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భారత్ న్యూజిలాండ్ చేతిలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడంపై కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, టీం మేనేజ్‌మెంట్‌లపై అందరూ విమర్శలు గుప్పించారు. అయితే ఆ ఓటమిపై కోహ్లి ఇప్పటి వరకు నోరు మెదపలేదు.
ఇటీవలే ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భారత్ న్యూజిలాండ్ చేతిలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చిన విషయం విదితమే. కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, టీం మేనేజ్‌మెంట్‌లపై అందరూ విమర్శలు గుప్పించారు. అయితే ఆ ఓటమిపై కోహ్లి ఇప్పటి వరకు నోరు మెదపలేదు. కానీ ఎట్టకేలకు కోహ్లి ప్రపంచ కప్ ఓటమిపై నోరు విప్పాడు.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు నెట్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయ్యాక ఆ ఓటమి భారం నుంచి బయట పడేందుకు తనకు కొన్ని రోజుల సమయం పట్టిందని అన్నాడు. నిత్యం ఉదయం లేవగానే అదే ఓటమి భారం మనస్సులోకి వచ్చేదని.. కానీ రాను రాను ఆ బాధ నుంచి బయట పడ్డానని కోహ్లి చెప్పాడు.
ఇక ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌కు వచ్చిన నేపథ్యంలో ప్రపంచ కప్ ఓటమి తాలూకు జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయట పడ్డామని, ప్రస్తుతం ప్లేయర్లందరూ ఉత్సాహంగా ఉన్నారని, వెస్టిండీస్‌తో మ్యాచ్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కోహ్లి తెలిపాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌పై టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు మూడింటిని గెలవాలన్న ఉత్సాహంలో తామంతా ఉన్నామని కోహ్లి అన్నాడు. కాగా వెస్టిండీస్ టూర్‌లో భాగంగా భారత్ విండీస్‌తో 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం 8 గంటలకు ఫ్లోరిడాలోని లౌడర్‌హిల్‌లో భారత్, విండీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది..!