యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి పనులు షురూ అయ్యాయి. మంగళవారం సాయంత్రం ముంబయిలోని నటి నివాసంలో ‘మాతా కీ చౌకీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కుటుంబసభ్యుల సమక్షంలో కాబోయే వధూవరులిద్దరూ దుర్గాదేవి పూజలో పాల్గొన్నారు. దీంతో ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో హన్సిక – సోహైల్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. కాబోయే భర్తను ఆలింగనం చేసుకున్న ఆమె ఆనందంతో మురిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
హన్సిక – సోహైల్ ఎంతోకాలం నుంచి మిత్రులు. ఆమెకు సంబంధించిన వ్యాపారంలోనూ అతడు భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. అభిరుచులు కలవడంతో ప్రేమలో పడిన వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. డిసెంబర్ 4న వీరి వివాహం జరగనుంది. రాజస్థాన్, జైపుర్‌లోని ఓ రాజకోట ఇందుకు వేదిక కానుంది. మరోవైపు, సోహైల్‌కు గతంలోనే వివాహమైంది. హన్సిక స్నేహితురాలు రింకీని ఆయన వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు.