ప్రాంతాలు వేరయినా నాయకులంతా ఒక్కటే..
ప్రాంతాలు మరియు పార్టీలు వేరయినా
కొన్నిసందర్భాల్లో నాయకులంతా ఒక్కటే
ఒకనాటి పీసీసీ చీఫ్ బొత్స ఇప్పుడు వైసీపీ మంత్రి
ఆ రోజు జగన్ ను తిట్టిన బొత్స ఇప్పుడు అదే జగన్ కొలువులో మంత్రిగా ఉండడం అన్నది యాదృచ్ఛికం.అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ ను కాదనుకుని వచ్చిన బొత్స తరువాత కాలంలో అదే పార్టీ పెద్దలతో చాలా కాలం సత్సంబంధాలు నెరపడం విశేషం. అప్పుడు తప్పక సమైక్య వాదం వినిపించినా తెలంగాణ నేతలతో ఉన్న దోస్తీని ఆయన కాదనుకోలేకపోయారు.ఇప్పటికీ అదే పంథాలో ఆయన ఉన్నారు. ఆంధ్రా అయినా, తెలంగాణ అయినా తనకు ఒక్కటే అన్న చందంగా వ్యాపార లావాదేవీలు, ఆస్తుల పరిరక్షణ, ఆస్తుల పెంపు అన్నవి ఇప్పటికీ ఎప్పటికీ జరిగేవే! అంటే బొత్స పేరుకు ఆంధ్రా మంత్రి అయినా ఆస్తుల రూపేణా తెలంగాణకు ఓ విధంగా ముద్దు బిడ్డ.
ఇంకాచెప్పాలంటే పెంపుడు బిడ్డ. అందుకే ఆయన నిన్నటి వేళ తన కొడుకు వివాహ వేడుకలను ఇరు ప్రాంతాలకూ చెందిన నాయకుల సమక్షంలో సమ్మోహనభరితంగా జరిపి తన సత్తా చాటారు. మరో మారు రాజకీయ బలనిరూపణ చేసుకున్నారు. ఆ విధంగా చాన్నాళ్లకు బొత్స ఆనందంగా ఉన్నారు. రెట్టించిన ఆనందంలో ఉన్నారు.
ఆంధ్రావని వాకిట కీలక రాజకీయవేత్తగా పేరొందిన బొత్స సత్యనారాయణ ఇంట నిన్నటి వేళ వివాహ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. హైద్రాబాద్ హైటెక్స్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదే వేడుకల్లో తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి సహా పలువురు కీలక నాయకులు సందడి చేశారు. వివాహానికి హాజరయిన వారిలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,టీఆర్ఎస్ ఎంపీలు కేశవరెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ మధుయాసకీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్,టీడీపీ లీడర్ గంటా శ్రీనుతదితరులు ఉన్నారు.