తెలంగాణలో ఉద్యోగకల్పన అంశంపై విపక్షాలకు మంత్రి కేటీఆర్ సవాల్‌తో రాజకీయం హీటెక్కింది. ఉద్యోగభర్తీకి సంబంధించి మంత్రి కేటీఆర్ లేఖ విడుదల చేశారు. మరోవైపు రేపటి చర్చకు సిద్ధమంటోంది కాంగ్రెస్.అయితే ఓయూకి వస్తే లెక్కలు తేలతాయంటున్నారు బీజేపీ నేతలు.
తమ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో బహిరంగ లేఖ విడుదల చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీలు నిజాలను దాచి… అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. 2014 నుంచి 2020 వరకూ లక్షా 32 వేల 899 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు కేటీఆర్. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామన్న మాటను నిలబెట్టుకున్నామన్నారు కేటీఆర్. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఎన్నో ఉద్యోగాలిచ్చామన్న జానారెడ్డి… తెలంగాణకు ఎన్నిచ్చారో చెప్పాలన్నారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని… ఎలక్షన్ కోడ్ ముగియగానే భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ కూడా అసత్యాలు చెప్పడం బాధాకరమన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ హయాం కంటే తామే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి. తెలంగాణలో 4 లక్షల 90 వేల ఉద్యోగాలిచ్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఇక ఉద్యోగ కల్పనపై ఉస్మానియా వర్సిటీలో లైవ్‌లో చర్చిద్దాం రండి అంటూ ప్రతి సవాల్ చేశారు బీజేపీ నేత రామచంద్రరావు.
ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ సవాల్‌ను కాంగ్రెస్ నేత స్వీకరించడంతో.. రాజకీయం వేడెక్కింది. ఇక నిన్న కేటీఆర్ సవాల్‌కు స్పందించిన శ్రవణ్..చెప్పిన సమయానికి గన్ పార్క్ కి వచ్చేస్తా అంటున్నారు .అయితే మంత్రి కేటీఆర్ ఈ చర్చకు వస్తారా..లేదంటే తనపార్టీ నాయకులను పంపిస్తారా..అనేది ఆసక్తికరంగా మారింది.