ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్, తమిళనాడు పోరే అందర్నీ ఎక్కువ ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం గెలుపోటములతో పాటు నేతల మధ్య పంతాలు, పట్టింపులు హైలైట్ కానున్నాయి. మరోవైపు చిన్న పార్టీలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రాజకీయాల్లో గెలవాలంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి. కాంగ్రెస్‌తో కంపేర్ చేస్తే.. ఈ విషయంలో పక్కా ప్లానింగ్‌తో దూసుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. పొత్తులైనా.. ఆ తర్వాత ఎత్తులైనా..చకచకా వేస్తూ.. ముందుకు సాగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అదే స్ట్రాటజీ ఫాలో అవుతూ.. బెంగాల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కమలం పార్టీ.
బెంగాల్ ఎన్నికలు బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్ దక్కించుకునేందుకు అన్నిరకాల వ్యూహాలు వేస్తూ.. టీఎంసీని వీక్ చేసేందుకు ఎప్పటికప్పుడు స్ట్రాటజీ మారుస్తూ బలపడుతోంది బీజేపీ. పశ్చిమ బెంగాల్‌ను ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ అన్నిరకాలుగా వ్యూహం రచిస్తోంది. నడ్డా కాన్వాయ్ మీద దాడి ఘటన తర్వాత అక్కడి రాజకీయం మరింత రంజుగా మారిపోయింది. ఆ తర్వాత అమిత్ షా పర్యటించడం.. టీఎంసీ నుంచి భారీగా వలసలు రావడంతో.. పొలిటికల్ పిక్చర్ ఒక్కసారిగా హీటెక్కింది. ఐతే ఇప్పుడు ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగి ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీంతో బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయ్.
కలుపుకొని పోవడం అనేది రాజకీయాల్లో కామన్ పాయింట్. బీజేపీ ఈ విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయదు. మొండిగా ముందుకు సాగదు. అందుకే చాలాసార్లు ఒంటరిగానే పోరుకు సిద్ధపడింది. పొత్తులు విషయంలో విజయం ముఖ్యం అన్నట్లుగా బీజేపీ ధోరణి ఉంటుంది. అందుకే పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ ఉన్న పార్టీతోనైనా సరే.. సంబంధిత రాష్ట్రంలో పొత్తుకు సిద్ధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో కూడా పొత్తుకు ఏ మాత్రం వెనకాడలేదు. అయితే అధికారంలోకి వచ్చాక పొత్తు పెట్టుకున్న పార్టీనే తిప్పలు పెట్టడం బీజేపీ స్ట్రాటజీ.
ఇక తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తుతో బరిలోకి దిగుతోన్న బీజేపీ.. కేరళలో ఓటు షేర్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కనీసం అయిదు సీట్లనైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలో బీజేపీ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2006 తర్వాతే ఆ పార్టీ స్పష్టమైన బలం సంతరించుకుంది. కంగారుపడిపోయి అన్ని చోట్ల పోటీ చేసే బదులు.. పట్టున్నచోట్ల, బలం ఉంది అనుకున్న ప్రాంతాల్లో దృష్టిసారించాలని భావించింది. ఐతే ఇక ఎన్నికలకు కొద్దినెలల ముందు పుదుచ్చేరి పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయ్. వచ్చే ఎలక్షన్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది కీ పాయింట్.
పశ్చిమ బెంగాల్ అధికార పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అసోంలో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలతో ఉంది.
ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికలు కేవలం అసెంబ్లీ ఫలితాలకే పరిమితమయ్యే అవకాశం లేదు. బీజేపీ విస్తరణ ఆకాంక్షలకు జనం మద్దతు ఉందా లేదా… కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చే ఛాన్స్ ఉందా.. లేదా అనే విషయాలు తేల్చనున్నాయి. అసోం ఫలితాలు సీఏఏపై నిర్ణయాన్ని ప్రభావితం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో డీఎంకే కూటమికి అధికారం వస్తే పర్వాలేదు.. అలా కాకుండా త్రిశంకు సభ ఏర్పడితే మాత్రం సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసినట్టే అవుతుంది.