తెలంగాణాలో పరిక్షల విషయంలో ఇప్పుడు చాలా వరకు ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా పలు రకాల పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రధానంగా పదో తరగతి పరిక్షలు వాయిదా వేయడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఈ పరీక్షలను నిర్వహిస్తారు అనేది ఎవరికి స్పష్టత రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని అంటున్నారు.
దీనిపై తాజాగా సోషల్ మీడియాలో మంత్రి కేటిఆర్ స్పందించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు స్పందించిన కేటీఅర్ విద్యార్థుల పరీక్షల గురించి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారన్న ఆయన… ప్రస్తుతం ఉన్నది సంక్షోభ సమయమని వివరించారు. ఇలాంటి సమయంలో కొంత ఓపిక పట్టాలని వారికి సూచనలు చేసారు. పరీక్షల షెడ్యూల్ కి సంబంధించి ప్రభుత్వం సరైన సమయంలో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుందని స్పష్టం చేసారు.
ఇక ఇదిలా ఉంటే… ప్రస్తుత లాక్ డౌన్ వలన ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న కాలుష్యం మరియు భూ తాపం వంటి అంశాల పట్ల కేటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మనసుకు నచ్చిన పనులు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని కొందరికి ఆయన సూచనలు చేసారు. చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ పొడిగించడం మంచిది అని కేటిఆర్ అభిప్రాయపడ్డారు.