రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అంతటా దుమారాన్ని రేపుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడుతున్నారు. మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, త్యాగాలను పదేపదే అవమానించడం ప్రధాని మోదీ మీకు అవమానకరం అంటూ… ప్రధాని చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ లో ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తూ.. తెలంగాణకు వ్యతిరేఖం కాదు కానీ.. కాంగ్రెస్ పార్టీ ఏపీని విభజించిన తీరు సరైందిగా లేదని ఆయన అన్నారు. మైకులు ఆపేసి, డోర్లు మూసేసి విభజన చేశారని కాంగ్రెస్ పార్టీపై విమర్శించారు. సరైన చర్చ లేకుండా విభజన చేశారని అన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆయన విమర్శించారు.