ఇటీవల కాలంలో తెలుగురాష్ట్రాలలో భూప్రకంపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. రీసెంట్ గా తెలంగాణలోని కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో భూప్రకంపణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఏపీలోని కుప్పం నియోజకవర్గంలోని పలు గ్రామాలలో భూప్రకంపణలు చోటుచేసుకున్నాయి. రామకుప్పం మండలంలోని పెద్దగెరెగపల్లి, గడ్డూరు, యానాదికాలనీ, దేసినాయనపల్లి, చిన్నగెరెపల్లిలో గురువారం రాత్రి భూమి కంపించింది.
ఒక్కసారిగా భూమిలోపల భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. సొంత గ్రామం విడిచిపెట్టి ప్రజలు రామకుప్పం మండల కేంద్రానికి పరుగులు తీశారు. దాంతో ప్రజాప్రతినిధులు ప్రజలకు రామకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. ఇక భూప్రకంపనల నేపథ్యంలో తహసిల్దార్ దేవరాజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక భూప్రకంపణలపై భూకంప తీవ్రతపై అధికారులు ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.