ప్రమాదాలనేవి చెప్పి రావు. అవి ఏ క్షణంలో అయిన జరగవచ్చు. అవి సంభవిస్తే కేవలం సెకన్ల వ్యవధిలోనే ప్రాణాలు పోతాయి. అలాంటి సమయంలో చాలా చకచక్యంగా వ్యవహరిస్తేనే ప్రాణాలను నిలబెట్టగలుగుతాం. అయితే ఆ లేడీ ఆఫీసర్ కూడా సరిగ్గా అలాగే చేసింది. సరైన టైముకు స్పందించి చకచకా ఆ వ్యక్తి వద్దకు వెళ్లి అతను రైలు కింద పడకుండా కాపాడింది.
కాలిఫోర్నియాలోని లోడి ఏవ్ అనే ప్రాంతంలో ఓ వ్యక్తి వీల్ చెయిర్‌పై రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్నాడు. అయితే అతని వీల్ చెయిర్ ట్రాక్స్‌లో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి అక్కడి నుంచి బయటపడడం సాధ్యం కాలేదు. మరొకవైపు దూరం నుంచి అతి వేగంగా రైలు దూసుకువస్తోంది. కొంచెం సేపు.. కొన్ని సెకన్లు ఆలస్యం అయినా.. ఆ వ్యక్తి రైలు కింద పడి అతని ప్రాణాలు పోయి ఉండేవి. కానీ అదే సమయానికి అటుగా వచ్చిన లేడీ పోలీస్ ఆఫీసర్ ఉరియా వెంటనే పోలీసు వాహనంలోంచి దిగి వేగంగా అతని వద్దకు పరిగెత్తుకు వెళ్లి వెంటనే అతన్ని ట్రాక్స్ నుంచి పక్కకు లాగింది.
అలా ఘటన అంతా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. ఆ లేడీ ఆఫీసర్ ఏమాత్రం ఆలస్యం చేసినా అతని ప్రాణాలు పోయి ఉండేవి. కానీ ఆమె త్వరగా స్పందించి కాపాడడంతో అతను స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. దీంతో అతన్ని సమీపంలోని హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా ఆ సమయంలో తీసిన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఫీసర్ ఉరియాను అందరూ అభినందిస్తున్నారు.