విశాఖ నుంచి ఇండిపెండెంట్‌గా..టీడీపీ-జనసేనకు జేడీ షాక్.!

-

ఏపీ రాజకీయాల్లో సి‌బి‌ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఊహించని ట్విస్ట్‌లు ఇస్తున్నారు. ఈయన వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన విషయం తెలిసిందే..అయితే టీడీపీ లేదా జనసేన నుంచి పోటీకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. అలాగే ఆ పార్టీల నుంచి ఆహ్వానం కూడా వచ్చిందని జేడీ చెబుతున్నారు. కానీ ఏదొక పార్టీలోకి పోటీకి దిగుతారని అంతా అనుకున్నారు. ఇంకా టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది.

పొత్తులోనే ఆయన పోటీ చేస్తారని అనుకున్నారు..అవసరమైతే టీడీపీలో బాలయ్య చిన్నల్లుడు భరత్ సీటు త్యాగం చేస్తారని ప్రచారం జరిగింది. ఇంత జరుగుతున్న తరుణంలో జేడీ తాజాగా ఓ బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. పలు పార్టీలు రమ్మని ఆహ్వానం పలికాయని.. కానీ సిద్ధాంతాలు కలవక పోవడం వల్ల ఏ పార్టీలోనూ చేరకూడదని నిర్ణయించుకున్నానని జేడీ స్పష్టం చేశారు.

అలాగే విశాఖ ఈస్ట్ అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్‌గా ఆయన కూతురు ప్రియాంక పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. మొత్తానికి ఇండిపెండెంట్‌లుగా పోటీ చేయడానికి జేడీ ఫ్యామిలీ రెడీ అయింది. జేడీ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల పరోక్షంగా టీడీపీ-జనసేనలకే నష్టం కలిగే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి పోటీ చేసి మంచిగానే ఓట్లు తెచ్చుకున్నారు. కాకపోతే ఓట్లు చీలడం వల్ల టీడీపీ 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది.

ఇప్పుడు మళ్ళీ జేడీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అంటున్నారు. దీంతో మళ్ళీ విశాఖలో టీడీపీకి నష్టం జరగచ్చు. జనసేనతో పొత్తు ఉన్నా సరే జేడీ ప్రభావం కాస్త ఉంటుంది. అలా అని జేడీకి గెలిచే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. చూడాలి మళ్ళీ జేడీ ఏమన్నా నిర్ణయం మార్చుకుంటారేమో.

Read more RELATED
Recommended to you

Exit mobile version