దాణా కుంభకోణంలో శిక్షపడి అనారోగ్య సమస్యలతో కొంతకాలం కిందట బెయిల్ పై విడుదలైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం ఆయన సింగపూర్ కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లేందుకు వీలుగా తన పాస్‌పోర్ట్‌ను ఇవ్వాలని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును లాలూ కోరారు. లాలూ పిటిషన్‌పై సీబీఐ కోర్టు త్వరలోనే విచారణ జరపనుందని ఆయన తరఫు న్యాయవాది ప్రభాత్ కుమార్ తెలిపారు.
దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ.. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన రెండు మూత్రపిండాలు 75శాతం మేర దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహం, హైబీపీతో లాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24న ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఈ నెల 20నే లాలూ సింగపూర్ వెళ్తారని సమాచారం.