టూరింగు టాకీసు : అదిగ‌దిగో కొత్త సినిమా..! ఆర్ఆర్ఆర్ ఇంకా

-

నాలుగంటే నాలుగు సినిమాలు..నాలుగంటే నాలుగు యుద్ధాలు..సినిమా తీయ‌డం అంటేనే యుద్ధం..సినిమా విడుద‌ల కూడా ఇవాళ యుద్ధ‌మే! అఖండ సినిమా అందించిన స్ఫూర్తితో సినిమాల విడుద‌ల‌కు జోరు పెరుగుతోంది. బాల‌య్య అందించిన స్ఫూర్తితో కొత్త సినిమాలన్న‌వి ఓవ‌ర్సీస్ మార్కెట్ వైపూ మ‌రులుతున్నాయి. ప‌రుగులు తీస్తున్నాయి. ఈ క్ర‌మంలో నాలుగంటే నాలుగు సినిమాలు ల‌క్షల కుటుంబాల జీవితాల‌ను ప్ర‌భావితం చేయనున్నాయి. అవును! అగ్ర హీరోలు వ‌స్తేనే థియేట‌ర్ల‌కు క‌ళ.. లేదంటే సినిమా థియేట‌ర్లు అన్నీ బోసిపోవాల్సిందే! క‌నుక వెలుగులు వ‌స్తున్నాయి.. చీక‌టిని పో పొమ్మ‌నండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్.

ఆర్ఆర్ఆర్ : రౌద్రం ర‌ణం రుధిరం

 

బాహుబ‌లి త‌రువాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ..ముందంతా జ‌నవ‌రి ఏడున వ‌స్తుందంటూ ఊద‌ర‌గొట్టారు.కానీ ఇప్పుడు డేట్ మారింది. డేట్ మారింది అంటే ఫేట్ మారింద‌నే! ఈ సినిమాను ఎస్ఎస్ రాజ‌మౌళి థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని సంకల్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఢిల్లీ తో స‌హా ఇత‌ర ఉత్త‌రాది రాష్ట్రాల‌లో క‌రోనా నిబంధ‌న‌లు స‌డలిస్తున్న నేప‌థ్యంలో ఈ సినిమా విడుద‌ల‌కు సంబంధించి లైన్ క్లియర్ అయింది. మార్చి 25న థియేట‌ర్ల ముందుకు రానుంది. ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ట్రైల‌ర్ అన్ని భాష‌లు క‌లుపుకుని 150 మిలియ‌న్ వ్యూస్ సంపాదించుకుని మోస్ట్ ఎవైటింగ్ మూవీగా పేరు తెచ్చుకుంది.

భీమ్లా నాయ‌క్ .. ప‌వ‌ర్ ఫుల్ మానియా

ప‌వ‌న్ – రానా న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల తేదీ పై ఇంకొంత సందిగ్ధ‌త అయితే ఉంది. ఫిబ్ర‌వ‌రి 25న కానీ ఏప్రిల్ ఒక‌టిన కానీ విడుద‌ల చేయాల‌ని ఆలోచిస్తున్నారు నిర్మాణ వ‌ర్గాలు. ప్యాండ‌మిక్ సిట్యువేష‌న్ ఉన్నందున విడుద‌ల తేదీపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని నిర్మాత సూర్య దేవ‌ర నాగ‌వంశీ అంటున్నారు. కుర్ర ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కే చంద్ర‌కు రైట‌ర్ త్రివిక్ర‌మ్ త‌న‌దైన స‌ల‌హాలు ఇస్తూ, మాట సాయం కూడా చేస్తూ ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతున్నారు.

ఎఫ్ 3 : ఫ‌న్ ఫ్ర‌స్టేష‌న్ తో పాటు..ఇంకొంత

వేస‌విలో  వినోదాల జ‌ల్లు కురిపించేందుకు వెంకీ, వ‌రుణ్ తేజ్ సిద్ధం అయ్యారు.అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సీక్వెల్ ఎప్పుడో రావాల్సి ఉన్నా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.త్వ‌ర‌లోనే ఈ సినిమా థియేట‌ర్ల ద‌గ్గ‌ర సంద‌డి చేయ‌నుంది. ఏప్రిల్ 28న ఈ సినిమా విడుద‌ల కానుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.

ఆచార్య… కూడా!


వేస‌వి వేళ వినోదాల‌ను అందించేందుకు మెగాస్టార్ కూడా రానున్నారు.ఆయ‌న న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుద‌ల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాజ‌ల్‌, పూజా హెగ్డే హీరోయిన్లు గా న‌టించారు.తొలి సారి రామ్ చ‌ర‌ణ్ తేజ్ పూర్తి నిడివి ఉన్న పాత్ర‌తో చిరు స‌ర‌స‌న న‌టించారు.మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

రాధే శ్యామ్

 


ఈ సినిమా కూడా ఎప్ప‌టి నుంచో విడుద‌ల‌కు ఎదురు చూస్తోంది. థియేట్రిక‌ల్ రిలీజ్ డేట్ అయితే క‌న్ఫం అయింది. మార్చి 11న ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు నిర్మాణ వ‌ర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. ప్ర‌భాస్, పూజా హెగ్డే జోడీగా న‌టించిన చిత్రం కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఓవ‌ర్సీస్ లో కూడా సినిమాపై భారీ అంచ‌నాలు ఉండ‌డంతో ప్ర‌భాస్ అక్క‌డి మార్కెట్ పై కూడా దృష్టి సారించారు. ప్యాన్ ఇండియా మూవీ ఇది.. బ‌హు భాష‌ల్లో విడుద‌ల కానుంది.

– టూరింగ్ టాకీస్ – మ‌న‌లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version