మనం నడుస్తున్న రోడ్లు.. నవ్విపోతున్నాయ్! గమనించారా? మనం అనుభవిస్తున్న ప్రాజెక్టులు మొహం చిట్లిస్తున్నాయ్!! మీలో ఎవరైనా పట్టించుకున్నారా?! లేదు!! అనే సమాధానం తప్ప మనదగ్గర ఏముంటుంది? కానీ, ప్రాణం లేని అవి ఎందుకు అలాకొట్టుకుంటున్నాయని ప్రశ్నిస్తే.. రాళ్లు నవ్వుతున్నాయి… చైతన్యం లేని గోడలు శపిస్తున్నాయ్! నువ్వు నడిచేందుకు వేసిన రాదారికి రాళ్లెత్తిన కూలీలు.. నువ్వు తాగేందుకు నీళ్లిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణానికి చెమట చుక్కలు రాల్చిన కార్మికులు నేడు.. కన్నీరు పెడుతున్నాయని, నువ్వు మనిషివేనా? అని శర పరంపరతో ప్రశ్నిస్తున్నాయి. నిజమే.. అప్పుడేప్పుడో చదివి వదిలేసిన శ్రీశ్రీ మహాప్రస్థానం లీలగా గుర్తుకు వస్తోంది కదూ! తాజ్ మహల్ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలు కళ్ల ముందు కనిపిస్తున్నారు కదూ!!
వారే కాదు.. మనం నిత్యం సంచరించే రాష్ట్ర రహదారులు, రయ్యన దూసుకుపోయే జాతీయ రహదారులు.. రివ్వున పరవళ్లు తొక్కే నదీ ప్రవాహాల ఆనకట్టలు ఇలా అనేకం పురుడు పోసుకున్న ఆ మట్టి చేతులు నేడు విలపిస్తున్నాయి. పరోకారార్ధమిదం శరీరం.. అన్న నానుడిని జీర్ణించుకుని ఇచ్చిన కలో కంతకో శ్రమను ఊడిగంగా మార్చిన కూలీలు.. నేడు మనం అందరం జీవించి ఉండగానే.. మనం మన కళ్లతో చూస్తూ ఉండగానే.. ఎవరూ లేని అనాధలుగా.. ఏ దిక్కూలేని అభాగ్యుల మాదిరిగా వందల వేల మైళ్లు కాలినడకన ముందుకు సాగుతున్నారు. కూటి కోసం.. కూలికోసం.. సొంత ఊళ్లను తృణప్రాయంగా వదిలి పెట్టిన కార్మికులకు లాక్‌డౌన్ పెట్టిన పెద్ద విషాదం ఇదే! మనోళ్లు డిగ్రీలు చదివి.. పెద్ద పెద్ద చదువులు వెలగబెట్టి.. పరాయి దేశాలకు వెళ్లి.. అక్కడ పనిచేసుకుని కోట్లు కూడబెట్టుకుని డాలర్ల మోజులో దేశానికి దూరంగా ఉంటే..
లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనాభూతం వారిని పాపం ఏం చేస్తుందోననే భయం మనందరం ఒత్తిళ్ల మీద ఒత్తిళ్లు తెచ్చి .. విమానాలు వేయించాం. స్వలాభం తప్ప.. స్వదేశానికి ఏమీ చేయని ప్రవాసుల కోసం మనం నిత్యం ఘోషిస్తున్నాం.. వారిని స్వదేశానికి తెచ్చే వరకు నిద్ర కూడా పోకుండా ఎదురు చూస్తున్నాం. మరి మనం నడిచే దారులను తమ చేతులతో పరిచి, మనం తాగే నీళ్లను సముద్రంలోకి ఇంకిపోకుండా ఒడిసి పట్టి.. ఆనకట్టలు కట్టిన వలస కూలీల విషయంలో మాత్రం విస్కృంఖల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాం. మనం కావాలంటే.. కొండలు ఎక్కగలం.. కానీ, అదే కొండను తొలిచి.. మనకు రాదారిని ఏర్పాటు చేసిన కార్మికుడిని మాత్రం పట్టించుకునే తీరిక మనకు లేదు. మన ప్రభుత్వాలకు అంతకన్నా లేదు.
ఏం చేస్తాం.. వలస పోతున్న ప్రాణాలను చూస్తూ.. పెదవి విరవడం తప్ప!! అంతేనా? మనలో చైతన్యం చచ్చిపోయిందా? మనలో రక్తం ఇంకిపోయిందా? అనే ప్రశ్న మన మస్తిష్కాలను తొలిచేయడం లేదా? పదండి ముందుకు.. పదండి తోసుకు.. పదండి పోదాం.. వలస కార్మికుల కష్టం తీర్చగ.. వలస జీవుల వెతలను బాపగ!! అనుకుంటే ఏదైనా చేయగల సత్తా మనకే ఉందనినిరూపిద్దాం.. మన కళ్ల ముందు నుంచి కాలి నడకన వెళ్తున్న వారికి మనకు తోచినంత సాయం చేద్దాం. ప్రభుత్వాలు చేస్తాయని సరిపెట్టుకుంటే.. మనల్ని మనం ద్రోహం చేసుకున్నవాళ్లమే అవుతాం! బుద్ధి మార్చుకుని బడుగులకు సాయం చేద్దాం.. రండి.. కదలండి!!